కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్యదీప్తి నిర్మించారు. నేడు విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నేను షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి హీరో కిరణ్‌తో పరిచయం ఉంది. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ వంటి హిట్ తర్వాత ఈ సినిమా చేశాం.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘అందరికి కావాల్సిన సినిమా ఇది. థియేటర్ నుంచి ఇంటికెళ్లేముందు ఒక ఎమోషన్‌ను తీసుకెళ్తారు. చక్కటి కుటుంబ అనుబంధాలు, వినోదం, ప్రేమ అంశాలతో అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది. నా భుజం తట్టి ప్రోత్సహిస్తున్న అందరికి కృతజ్ఞతలు’ అన్నారు. నిర్మాత దివ్యదీప్తి మాట్లాడుతూ ‘కథానుగుణంగా మణిశర్మగారు చక్కటి స్వరాల్ని అందించారు. కిరణ్ అందించిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. యువత, కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమవుతుంది’ అన్నారు.