Neha Shetty | ‘మెహబూబా’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘డీజే టిల్లు’ లవర్‌గా యువత గుండెల్లో చోటు దక్కించుకుంది నేహా శెట్టి. టిల్లు బతుకును బర్బాత్ చేసిన రాధికగా మరోమారు ‘టిల్లు స్క్వేర్’లో గెస్ట్ రోల్లో తళుక్కుమన్నది. త్వరలోనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో కలిసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నది ఈ కన్నడ కుట్టి. పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తేనేమి, నిండైన దుస్తులతో గుండెల్లో దూరితేనేమి.. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఓ వైపు గ్లామర్ డోస్ పెంచేసి, రొమాన్స్‌తో మత్తెక్కించేస్తూనే మరోవైపు లంగావోణీలో అచ్చతెలుగు ఆడపిల్లను మరిపిస్తున్న ఈ బ్యూటీ చెప్పిన కబుర్లు…
నటిగా ప్రేక్షకులను మెప్పించే పాత్రలే చేయాలనుకుంటా. కథ నచ్చితేనే ఒప్పుకొంటాను. కథకు సరిపోయేలా నటించడానికి వంద శాతం కృషి చేస్తాను. నా పాత్ర ప్రాధాన్యం, కథ మాత్రమే నాకు ముఖ్యం. మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఒకసారి కథ ఓకే చేస్తే స్క్రిప్ట్‌కు అనుగుణంగా నన్ను నేను మలుచుకుంటా.
చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. నాలుగో తరగతి నుంచే ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టా. కాలేజీలో చదువుకుంటూనే మోడలింగ్ చేసేదాన్ని. ‘మిస్ మంగుళూరు-2014’ కిరీటాన్ని దక్కించుకున్నా. ఆ తర్వాత ఏడాదే ‘మిస్ సౌత్ ఇండియా’ మొదటి రన్నరప్‌గా నిలిచా. వెంటనే ‘ముంగారు మలే-2’ కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. ‘మెహబూబా’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టా.
ఒక సినిమా హిట్ కాగానే పొంగిపోను. అలాగే ఫ్లాప్ అయితే కుంగిపోను. నన్ను నేను నమ్ముతాను. ఇది ఒక ప్రయాణం. దీంట్లో అనేక ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. డీజే టిల్లు కంటే ముందు చేసిన సినిమాలు అనుకున్నంత ఆడకపోయినా నటిగా నాకొక గుర్తింపునిచ్చాయి. రాధికగా ప్రేక్షకులను మెప్పించేందుకు ఆ సినిమాల్లోని పాత్రలు పునాదిగా మారాయి.
వయసుకు తగినట్లు ఫ్యాషన్ ఫాలో అవుతా. కాలేజీ రోజుల్లో బొట్టు, పెద్ద పెద్ద చెవి కమ్మలు, కుర్తీ, చుడీదార్లే నా ప్రధాన అలంకరణ. ఆ రోజుల్లో మోడ్రన్‌గా కన్నా సంప్రదాయబద్ధంగా కనిపించేందుకే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ప్రస్తుతం చీరలే నా మొదటి చాయిస్.
నాకు పాజిటివ్ నేచర్ ఎక్కువ. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాను. డీజే టిల్లు తర్వాత నా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. చాలా అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నా. ‘బెదురులంక’, ‘రూల్స్ రంజన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వేటికవే భిన్నమైన నేపథ్యంతో రూపొందిన సినిమాలు.
శ్రీదేవి నాకు స్ఫూర్తి. ఆమె గ్లామరస్‌గానూ, నటనతోనూ ప్రేక్షకులను మెప్పించారు. కేవలం గ్లామర్‌తో రాణించాలనుకున్నా, నటనతో మాత్రమే మెప్పించాలనుకున్నా కష్టం. అందుకే నాకు నేను ఎలాంటి రూల్స్ పెట్టుకోలేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా. శ్రీదేవి గారిలా అన్నిరకాల పాత్రల్లో రాణించాలనుకుంటున్నా.
ర కరకాల భాషలు నేర్చుకోవడం నా అలవాటు. అమ్మది కూర్గ్, నాన్నది బెంగళూరు దాంతో ఇంట్లో మలయాళం, కన్నడ, స్కూల్లో హిందీ, బయట ఇంగ్లిష్, టాలీవుడ్‌కు వచ్చాక తెలుగు.. ఇలా అన్ని భాషలూ నేర్చుకున్నా. ఇంకా నేర్చుకుంటున్నా. భాష వస్తేనే ప్రేక్షకులను అర్థం చేసుకోగలం.