Master Mahendran | చైల్డ్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించిన మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ “నీలకంఠ”. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఎల్ఎస్ ప్రొడక్షన్స్ మరియు గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుక సినీ ప్రముఖుల మధ్య కోలాహలంగా సాగింది.
ఈ వేడుకకు యువ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘శంబాల’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆది సాయికుమార్ మాట్లాడుతూ, తన మిత్రుడు మహేంద్రన్ ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సినిమానే నా ప్రపంచం: హీరో మహేంద్రన్
హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. సినిమానే నా ప్రపంచం. పోటీ ఎంత ఉన్నా సరే, ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా కష్టపడుతూనే ఉంటాను. డైరెక్టర్ రాకేష్ కథ చెప్పినప్పుడే ఆయన ప్రతిభ ఏంటో నాకు అర్థమైంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. యష్న ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించింది. జనవరి 2న థియేటర్లలో మా చిత్రాన్ని చూసి ఆదరించండి అని కోరారు.
కొత్తగా కనిపించబోతున్న ‘చిత్రం’ శ్రీను
ప్రముఖ నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను గతంలో ఎన్నడూ చేయని ఒక వైవిధ్యమైన పాత్రను పోషించానని తెలిపారు. దర్శకుడు రాకేష్ ప్యాషన్, నిర్మాతల కృషి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని, మహేంద్రన్ పేరు ముందు ‘మాస్టర్’ బదులు ‘స్టార్’ అనే ట్యాగ్ రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మాస్టర్ మహేంద్రన్, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్, చిత్రం శ్రీను, శివ తదితరులు ఈ సినిమాలో నటిస్తుండగా.. రాకేష్ మాధవన్ దర్శకత్వం అందిస్తున్నాడు. మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు.