గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అగ్ర హీరో బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటన, టీజర్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈ నెల 15న టైటిల్, టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలకృష్ణ ఆయుధాలు ధరించి యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన బందిపోటు పాత్రలో కనిపిస్తారని, పేదల పక్షపాతిగా ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.