Pushpa 2 | ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి తరచు వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా కొన్ని కారణాల వలన విడాకులు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ధనుష్- ఐశ్వర్య జంటతో పాటు ఏఆర్ రెహామాన్, అమీర్ ఖాన్లు కూడా తమ భార్యలతో విడాకులు తీసుకోవడం అభిమానులకి ఏ మాత్రం మింగుడుపడలేదు. ఇక ఇప్పుడు పుష్ప విలన్ కూడా విడాకులు తీసుకుంటున్నాడా అనే సందేహం అభిమానుల మదిలో తలెత్తుతుంది. ఎంతో అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతున్న ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్ , ఫహాద్ ఫాజిల్ జంట కూడా త్వరలో విడిపోబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అందుకు కారణం కూడా లేకపోలేదు. రీసెంట్ గా నజ్రియా పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ వీళ్ళు విడిపోబోతున్నారు అనే రూమర్స్ కి మరింత బలం చేకూరేలా చేసింది. నజ్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సూక్ష్మ దర్శిని అనే చిత్రం లో హీరోయిన్ గా నటించిన నజ్రియా, ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో చాలా యాక్టివ్గా ఉండేది. కాని ఆ తర్వాత ఎందుకో పెద్దగా యాక్టివ్ లేదు. అలా ఎందుకు యాక్టివ్గా ఉండలేదో తెలియజేస్తూ ఒక లేఖను విడుదల చేసింది. అందులో ఏముందంటే ‘అభిమానులంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే నేను, ఈమధ్య కాలం లో యాక్టీవ్ ఎందుకు లేనో చెప్పడానికి ఇంకొంత సమయం కావాలి. గత కొంతకాలం గా నేను వ్యక్తిగత సవాళ్లతో ఇబ్బంది పడుతున్నాను’
‘నా మనసు ప్రశాంతంగా లేకపోవడంతో పాటు డిప్రెషన్లోకి వెళ్లాను. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను మిస్ అయ్యాను. ‘సూక్ష్మ దర్శిని’ విజయాన్ని కూడా నేను ఆస్వాదించలేకపోయాను. అలానే నా 30వ పుట్టిన రోజు కూడా జరుపుకోలేదు. ఎందుకు ఇలా అయిపోయావు అని నా స్నేహితులు, సన్నిహితులు ఫోన్ కాల్స్ , మెసేజ్లు చేస్తుంటే వారికి కనీసం రిప్లై ఇవ్వలేదు. అందుకు నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. కొత్త సినిమాల కోసం కూడా నాకు చాలా మంది దర్శక నిర్మాతలు కాల్ చేశారు. వాళ్లకి రిప్లై ఇవ్వలేదు. ఇది చాలా కఠినమైన సమయం. నేను కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పూర్తిగా కోలుకొని మళ్లీ మనుపటిలా మీ ముందుకు రావడానికి కాస్త సమయం పట్టొచ్చేమో అంటూ నజ్రియా పేర్కొంది. నజ్రియా ఇంత డిప్రెషన్కి వెళ్లిందంటే కచ్చితంగా ఫహాద్ తో విడాకుల వ్యవహారమే అయి ఉండొచ్చేమో అని పలువురు భావిస్తున్నారు.