Nayanthara Vs Dhanush | నయనతార బహిరంగ లేఖ కోలీవుడ్‌లో కలకలం సృష్టించింది. ధనుష్‌పై లేడి సూపర్ స్టార్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు స్పందించారు. పలువురు హీరోయిన్లు నయనతారకు మద్దతు పలికారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నయనతారకు మద్దతు తెలిపిన హీరోయిన్లలో కొందరు ధనుష్‌తో కలిసి నటించిన వారే. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య లక్ష్మీ, నజ్రియా ఫహద్, అనుపమ పరమేశ్వరన్, పార్వతీ తిరువోతు, మంజిమా మోహన్, గౌరి కిషన్ నయన్‌కు మద్దతు తెలిపారు. తాజాగా ఈ జాబితాలో శ్రుతి హసన్ చేరింది. ధనుష్, నయన్ వివాదంలో ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. నయనతార చేసిన పోస్ట్‌ను లైక్ చేసి మద్దతు తెలిపింది. పార్వతి తిరునవోతు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పోస్ట్‌ని షేర్ చేస్తూ మద్దతు ప్రకటించింది.
నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో రాబోతున్నది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్కి చేయనున్నది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. అయితే, డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది.
తాను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సింగిల్ ఉమెన్‌గా ఇండస్ట్రీకి వచ్చానని.. ఛాలెంజింగ్‌గా హార్డ్ వర్క్, డెడికేషన్‌తో ప్రస్తుత పరిస్థితికి చేరుకున్నానని.. నా పాజిటివ్ జర్నీపై అభిమానులకు, నన్ను ప్రేమించే సినీ వర్గాలకు బాగా తెలుసునని చెప్పింది. అభిమానులు, శ్రేయోభిలాషులు డాక్యుమెంటరీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పింది. ప్రేమ, పెళ్లితో సహా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను చూపించే ఈ డాక్యుమెంటరీలో నేను రౌడీనే సినిమా ప్రస్తావన ఎక్కువగా లేకపోవడం బాధాకరమని.. సినిమాలోని క్లిప్పింగ్స్, పాటలు, ఫొటోలను ఉపయోగించుకునేందుకు ధనుష్ నుంచి ఎన్ఓసీ కోసం రెండేళ్లు ఎదురుచూశామని.. అయినా నిరాశే ఎదురైందని చెప్పింది. ట్రైలర్లో ఉపయోగించిన 3 సెక్‌ల వీడియోపై నోటీసులు పంపడం షాకింగ్ ఉందని.. ప్రైవేట్ వీడియో సన్నివేశానికి రూ.10కోట్లు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పేర్కొంది. తన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నించాడంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ అంశంపై సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ మారింది.