దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా చలామణీ అవుతున్నది అగ్ర కథానాయిక నయనతార. ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసి.. తొలి చిత్రంతోనే తిరుగులేని గుర్తింపును దక్కించుకుంది. దాంతో హిందీ చిత్రసీమలోని పలువురు అగ్ర దర్శకనిర్మాతలు నయనతారతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ అమ్మడు బాలీవుడ్లో మరో భారీ ఆఫర్‌ను చేజిక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..‘గంగూబాయి కతియావాడి’ విజయం తర్వాత ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘బైజు భావ్రా’ పేరుతో పీరియాడిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ను తెరకెక్కించబోతున్నారు.
సంగీతప్రధానంగా 1950 నేపథ్యంలో జరిగే కథ ఇది. రణవీర్‌సింగ్, అలియాభట్ జంటగా నటించబోతున్నారు. ఈ సినిమాలో కీలకమైన రెండో నాయిక పాత్రలో నయనతారను ఎంపిక చేసే ఆలోచనలో సంజయ్‌లీలా భన్సాలీ ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తున్నది. నయనతార నటించిన తమిళ చిత్రం‘ఇరైవన్’ తెలుగులో ‘గాడ్’ పేరుతో ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతున్నది.