Nayanthara | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎన్నాళ్లుగానో మంచి మెగా హిట్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ‘మన శంకరవర ప్రసాద్ గారు’ రూపంలో సరైన సమాధానం దొరికింది. చిరు స్టామినాకు తగ్గ సినిమా రావడం లేదని, వింటేజ్ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూడాలనే ఆశ ఫ్యాన్స్‌లో బలంగా ఉండేది. ఆ ఆశను నిజం చేస్తూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగి అంచనాలను మించి ఘనవిజయం సాధించింది. కుటుంబ ప్రేక్షకులు, యువత మాత్రమే కాదు… సీనియర్ ఫ్యాన్స్ నుంచి జూనియర్ ఫ్యాన్స్ వరకూ అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా మెగా హిట్‌గా నిలిచింది.విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, కేవలం తెలుగు మార్కెట్లోనే ఇంత భారీ స్థాయిలో రాణించిన సినిమాల్లో ఒకటిగా ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా థియేటర్లలో నిలకడగా వసూళ్లు రావడం యూనిట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ విజయాన్ని మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు నిర్మాతలు భారీ స్థాయి విజయోత్సవ వేడుకకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టాలని తన టీమ్‌కు సూచించినట్లు టాక్. ప్రస్తుతం చిరంజీవి దుబాయ్‌లో ఉన్నప్పటికీ, ఆయన హైదరాబాద్‌కు తిరిగివచ్చిన వెంటనే ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఈ వేడుకను ఓ గ్రాండ్ లెవెల్లో చేయాలని యూనిట్ భావిస్తోంది. సినిమాలో పని చేసిన టెక్నీషియన్లు, నటీనటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ఈ వేడుకపై మరో ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. సినిమాలో శంకరవర ప్రసాద్ భార్య శశిరేఖ పాత్రలో నయనతార చేసిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొంటే వేడుక మరింత ప్రత్యేకంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ నయనతార సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉండటం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆమె హాజరు కాలేదు. ఈసారి కూడా ఆమె రావడం కష్టమేనని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించాడు. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా సాధించని విధంగా కేవలం మొదటి పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. జనవరి 25వ తేదీ ఆదివారం ఈ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.