‘మీరు సినిమాల్లోనే నీతులు చెబుతారు. కానీ వాటిని పాటించరు. ఈ చర్యతో మీ క్యారెక్టర్ తేటతెల్లమైంది. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి, మనుగడ కోసం పోరాటం చేసి, ఈ స్థాయికి వచ్చాను. నా గురించి అందరికీ తెలుసు. దేవుడు చూస్తున్నాడు. ఆయనే సమాధానం చెబుతాడు. నువ్వు ఇంతలా దిగజారుతావని అనుకోలేదు. నీ అల్పబుద్ధిని చాటుకున్నావు. మీ నోటీసును మేం న్యాయబద్ధంగానే ఎదుర్కొంటాం’ అంటూ హీరో ధనుష్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది నయనతార. ఆమె జీవితం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. ఈ నెల 18న ఇది స్ట్రీమింగ్ కానుంది.
విఘ్నేష్ దర్శకత్వంలో వహించిన ‘నానుమ్ రౌడీ దాన్'(2016) సినిమా నయన్ జీవితంలో కీలకం. ఆ సినిమా సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకే అందులోని సన్నివేశాలను, పాటలను డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. దానికి సంబంధించిన ఎన్వోసీ(అనుమతి పత్రం) కోసం ఆ చిత్ర నిర్మాతైన హీరో ధనుష్‌ని డాక్యుమెంటరీ మేకర్స్ సంప్రదించారు. రెండేళ్లపాటు పోరాడినా ధనుష్ మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదు. డాక్యుమెంటరీ స్ట్రీమింగ్కి వస్తున్న నేపథ్యంలో రీసెంట్గా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్ ఉండటంతో, అందుకు నష్టపరిహారంగా 10కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ నయనతార టీమ్‌కు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. దాంతో మనసు నొచ్చుకున్న నయనతార.. ధనుష్‌కు భారీ లెటర్ని రాసింది. ఇందులో ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది.