తిరుమల : మూడుముళ్ల బంధంతో ఏకమైన సినీ దంపతుల ఆనందక్షణాలు గంటలు గడవక ముందే చుట్టుముట్టిన వివాదంపై నూతన వధూవరులు నయనతార దంపతులు క్షమాపణలు కోరారు. ఈ మేరకు భర్త విఘ్నేశ్ శివన్ ఓ లేఖ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తమకు దేవుడిపై అపారమైన నమ్మకం , భక్తి ఉందని స్పష్టం చేశారు. దర్శన అనంతరం భక్తులు ఎక్కువగా ఉండడంతో తిరిగి వెళ్లిపోయి ఫొటోషూట్ కోసం హడావుడిగా చెప్పులు వేసుకొని రావడం జరిగిందని తెలిపారు.
తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని ఆయన కోరారు. ‘ తాము తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా అనుకున్నాం. ఈ క్రమంలోనే గడిచిన 30 రోజుల్లోనే 5 సార్లు తిరుమలకు వచ్చామని’ పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే, పెళ్లైన వెంటనే మండపం నుంచి నేరుగా శుక్రవారం తిరుమలకు వచ్చి స్వామి కల్యాణం వీక్షించి ఆశీస్సులు తీసుకున్నామని వివరించారు.
తాము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదని, దయచేసి క్షమించండని విఘ్నేశ్ శివన్ ఆ లేఖలో పేర్కొన్నారు .