ఎరుపెక్కిన ఆకాశం.. రక్తపు జల్లులతో తడుస్తున్న రణరంగం.. యుద్ధభూమిలో తలపడుతున్న సైన్యం.. చుట్టూ ఎత్తయిన ప్రాకారాలు.. ఈ భీతిగొల్పే వాతావరణం మధ్య గంభీరంగా చూస్తున్న ఓ వీరనారి.. ఆ వీరనారిగా లేడీ సూపర్‌స్టార్ నయనతార. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్‌తో కూడిన పోస్టర్నీ, ఈ నేపథ్యంతో కూడిన వీడియోను ‘NBK 111’ టీమ్ విడుదల చేశారు.
ఈ భారీ పానిండియా హిస్టారికల్ డ్రామాలో నయనతార కథానాయికగా నటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం ఈ ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎంత భారీ స్థాయిలో రూపొందనున్నదో ఈ ప్రచార చిత్రాలు తెలియజేశాయి.
ఇందులో నయనతార మహారాణిగా కథలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, ఇప్పటివరకూ చూడని గ్రాండియర్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందనున్నదని మేకర్స్ తెలిపారు. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో బాలకృష్ణ కనిపించనున్నారని, ఇంటెన్స్, ఎమోషన్స్‌తో కూడిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఇదని, అద్భుతమైన విజువల్స్‌తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నామని మేకర్స్ చెప్పారు.
బాలకృష్ణ, నయనతార కలిసి నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా చిత్రాలు విజయాలను అందుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న నాలుగో సినిమా ఇది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈ నెల చివరివారంలో జరుగనున్నాయి.