వరుణ్‌సందేశ్, ప్రియాంక జైన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘నయనం’. సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు డైరెక్టర స్వాతి ప్రకాశ్. అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా కీలక పాత్రధారులు. మంగళవారం ‘నయనం’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ ‘ ఈ కథ వినగానే కాసేపు షాక్‌లో ఉండిపోయా. ఇందులో నయన్ క్యారెక్టర్ చేయాలని వెంటనే డిసైడ్ అయిపోయా. చాలా రోజుల తర్వాత మంచి ప్రాజెక్ట్ చేశాననే సంతృప్తితో మీ ముందుకు వస్తున్నా. అన్ని రకాలుగా ఈ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని నమ్మకంగా చెప్పారు.
ఇందులో మాధవిగా కనిపిస్తానని, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కథానాయిక ప్రియాంక జైన్ అన్నారు. డైరెక్టర్ స్వాతి ప్రకాశ్ మాట్లాడుతూ ‘పక్కవారి జీవితం గురించి తెలుసుకోవాలనే కుతూహలం పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సిరీస్. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ సిరీస్‌కు పనిచేశారు.’ అని తెలిపారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ ఆరసాడ, ఎడిటర్ వెంకటకృష్ణ, డీవోపీ షోయబ్ సిద్ధికీ, నటుడు అలీ రెజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విద్యాసాగర్, నిర్మాత రజనీ తాళ్లూరిలతో పాటు జీ 5 ప్రతినిధులు కూడా మాట్లాడారు.