Om Puri, Irrfan Khan | దివంగత బాలీవుడ్ నటులు ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్ వంటి గొప్ప నటులను హిందీ చిత్ర పరిశ్రమ తగిన స్థాయిలో గుర్తించలేకపోయిందని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరినీ పెద్ద బడ్జెట్ కమర్షియల్ సినిమాల్లో హీరోలుగా ఎందుకు తీయలేకపోయారో తనకు అర్థం కాలేదన్నారు. వీరిద్దరూ చిన్న, మధ్య తరహా సినిమాలకే పరిమితమయ్యారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్రేక్షకులు వారి నటనను మెచ్చుకున్నా, నిర్మాతలు వారిని భారీ చిత్రాల్లో హీరోలుగా ఊహించలేకపోయారని సిద్ధిఖీ అన్నారు. ఇర్ఫాన్, ఓం పురి మరణించిన తర్వాత అందరూ గుర్తు చేసుకుంటున్నారని, కానీ జీవించి ఉన్నప్పుడు వారికి తగిన గుర్తింపు, పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదని ఆయన గుర్తు చేశారు. ఇర్ఫాన్‌ను హీరోగా పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘వుల్ఫ్’ సినిమాలో జాక్ నికల్సన్తో కలిసి నటించిన ఓం పురి నటన అద్భుతమని కొనియాడారు. అలాగే సాధారణ హీరో రూపురేఖలు, మూసధోరణులకు ఇండస్ట్రీ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే గొప్ప ప్రతిభ ఉన్న నటులు వెనుకబడిపోతున్నారని సిద్ధిఖీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తారని, కానీ బాలీవుడ్లో హీరో, స్టార్ అంటూ వర్గీకరణలు ఉండటం వల్ల ప్రతిభావంతులైన నటులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన అన్నారు.