హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కొత్త సినిమా ‘హడ్డి’లో ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించబోతున్నారు. అక్షత్ అజయ్ శర్మ దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను నవాజుద్దీన్ తెలిపారు. వారి ప్రవర్తనను పరిశీలించేందుకు కొన్ని రోజులు ట్రాన్స్ జెండర్స్తో కలిసి గడిపానని ఆయన తెలిపారు.
నవాజుద్దీన్ మాట్లాడుతూ…‘ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించడం అంటే కేవలం ఆ పాత్ర క్యారికేచర్లా ఉండకూడదు అనుకున్నాను. వారి ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగాలు అన్నీ దగ్గరగా చూసి తెలుసుకోవాలనుకున్నా. అందుకే వారితో కొద్ది రోజులు ఉన్నాను. ఈ క్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ట్రాన్స్ జెండర్స్ ప్రపంచాన్ని చూసే దృక్కోణం వేరు’ అని చెప్పారు.ప్రస్తుతం ఈ నటుడు ‘టికు వెడ్స్ షేరు’, ‘భోలే చుడియా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.