Prabhas |టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన హ్యూమర్‌తో ప్రేక్షకులను నవ్వించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న తన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన “పెళ్లి రిసెప్షన్” ఈవెంట్లో మీడియా ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు. పెళ్లి గురించి ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను ఎప్పుడు నిజం చేస్తారు? అని మీడియా అడగగా.. “ప్రభాస్ ఏ రోజైతే పెళ్లి చేసుకుంటారో, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటా” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు వివాహం చేసుకోకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిన నవీన్, ఇకపై తనను కూడా పెళ్లి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టొద్దన్న సందేశం ఇచ్చినట్టయ్యింది. అంతేకాదు ప్రభాస్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పిన నవీన్.. “ప్రభాస్ అన్న స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఓటీపీ నాకు వస్తుంది” అంటూ మరో సరదా వ్యాఖ్య చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ.. తనను ఎక్కువ ప్రశ్నలు అడగకూడదని, ఆమె కోసం తానే మారిపోతానని తెలిపారు.
ఇక సంక్రాంతి బాక్సాఫీస్ పోటీపై స్పందించిన నవీన్ పోలిశెట్టి, మెగాస్టార్ చిరంజీవి చిత్రంతో పాటు తన సినిమా విడుదలవుతున్నా ఎలాంటి భయం లేదన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్టార్‌గా ఎదగడానికి చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రశంసించారు. చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాను చూసేందుకు వచ్చే ప్రేక్షకులు తమ సినిమా ‘అనగనగా ఒక రాజు’ కూ వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉండగా, నవీన్ కామెంట్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.