Navdeep About Shivaji Comments | టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న నటుడు నవదీప్ ఎందుకు మౌనంగా ఉన్నారు? శివాజీని ఎందుకు వారించలేదు? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంపై నవదీప్ స్పందించారు. ‘దండోరా’ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా చిత్రబృందం తాజాగా విద్యార్థులతో ఒక చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక విద్యార్థి నేరుగా నవదీప్‌ను ప్రశ్నిస్తూ.. “శివాజీ గారు వేదికపై అంత ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన పక్కనే ఉన్న మీరు ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఆయనను ఎందుకు ఆపలేదు?” అని అడిగారు.
ఈ ప్రశ్నకు నవదీప్ మాట్లాడుతూ.. “ఒక వ్యక్తి వేదికపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నప్పుడు, మధ్యలో అడ్డుపడటం లేదా ఆపడం అనేది సరైన పద్ధతి కాదు. అది సంస్కారం అనిపించుకోదు. శివాజీ గారు పరిశ్రమలో నాకంటే చాలా సీనియర్. 30 ఏండ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఆయనకు ఒక విషయంపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, అందుకే నేను ఆ సమయంలో మౌనంగా ఉన్నాను” అని నవదీప్ వివరించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో మీరు కూడా చూసేయండి.