Nani | ఎప్పుడో ఒకసారి కొత్త దర్శకుడితో పని చేయడానికే హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అనుభవం ఉండదు.. డెబ్యూ డైరెక్టర్ అంటే నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో చాలా ఆంక్షలు పెడుతుంటారు. మార్కెట్ ఉండదు కాబట్టి అన్నింటికీ కాంప్రమైజ్ అవుతుంటారు. అందుకే కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపించరు. ఒకవేళ కథ బాగా నచ్చిన కూడా కండిషన్స్ అప్లై అంటుంటారు. కానీ నాని మాత్రం అలా కాదు. వరుసగా కొత్త దర్శకులకు, అప్ కమింగ్ డైరెక్టర్స్‌కు అవకాశాలు ఇస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి కాదు.. ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొత్త దర్శకుడితో పని చేయడానికి నాని ఓకే అంటున్నాడు.
2023లో చేసిన రెండు సినిమాలు కూడా కొత్త దర్శకులతోనే. అందులో దసరా ఏకంగా 65 కోట్లకు పైగా వసూలు చేసి నాని మార్కెట్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత చేసిన హాయ్ నాన్న కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఈ రెండు సినిమాలతో శ్రీకాంత్ ఓదెల, శౌర్యు దర్శకులుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక 2024 లో కూడా ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు నాని. ఈ క్రమంలోనే బలగం దర్శకుడు వేణు చెప్పిన కథకు ఈయన ఓకే చెప్పాడు. దిల్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే నటుడు సుప్రీత్ రెడ్డి త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నాడు.
ఛత్రపతి, మర్యాద రామన్న సహా చాలా సినిమాల్లో ఈయన ప్రతి నాయకుడిగా మెప్పించాడు. కొన్ని రోజులుగా ఈయన సినిమాలు చేయడం లేదు. దానికి కారణం దర్శకుడిగా మారనుండటమే. ఒక కథ సిద్ధం చేసుకుని నానికి చెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే సినిమా ఇది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. లేదంటే యూవీ క్రియేషన్స్‌లో ఈ సినిమా సెట్స్ పైకి రావచ్చు. నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయకు కూడా ఉన్న అనుభవం మూడు సినిమాలే. ఎలా చూసుకున్నా కూడా కొత్త దర్శకులకు నాని అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. దాని వల్ల న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడమే కాదు.. కొత్త కథలు వస్తాయని నమ్ముతున్నాడు నాని. ఈయన లాగే మిగిలిన హీరోలు కూడా ఆలోచిస్తే ఇండస్ట్రీకి వచ్చే కొత్త దర్శకుల సంఖ్య ఇంకా పెరుగుతుంది.