‘ఏజెంట్’ ‘గాండీవధారి అర్జున’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కథానాయిక సాక్షి వైద్య. ఈ భామ శర్వానంద్ సరసన నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత. ఈ సందర్భంగా బుధవారం సాక్షి వైద్య విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకుంది. ఈ సినిమాలో తాను అమాయకత్వం, నిజాయితీ కలబోసిన నిత్య అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, అభినయపరంగా కూడా సవాలుగా అనిపించిందని చెప్పింది.
ఈ సినిమా కోసం నెలరోజుల పాటు వర్క్‌షాప్ చేయడం వల్ల క్యారెక్టర్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నది. ఆమె ఇంకా చెబుతూ ‘శర్వానంద్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయనతో నటించడం గొప్ప ఎక్స్పీరియన్స్. కేరళ షూటింగ్ మంచి అనుభూతుల్ని మిగిల్చింది. ఈ సంక్రాంతికి పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది. తాను ఫిజియోథెరపీ చేశానని, కానీ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేయడం లేదని సాక్షి వైద్య తెలిపింది. ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తెలుగులో తన కెరీర్‌కు బ్రేక్‌నిస్తుందనే నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.