Oka Brundavanam | కంటెంట్‌ను నమ్మి తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక బృందావనం’. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ వంటి సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీస్ ద్వారా ఈ నెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకకు ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు వీఎన్ ఆదిత్య విశిష్ట అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ, “ఈ సినిమా కథ నాకు తెలుసు. ఇదొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫీల్‌గుడ్ ఫిల్మ్. ఒక అబ్బాయి లైఫ్ జర్నీని ఇందులో చూపిస్తారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారు. సినిమా మీద ప్యాషన్‌తో యూఎస్‌లో జాబ్ చేస్తూ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాతో అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. హీరో బాలు పర్ఫార్మెన్స్ అందర్నీ అలరిస్తుంది. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ సినిమాను చూశామన్న అనుభూతి కలుగుతుంది” అని అన్నారు.
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, “ఈ సినిమా నిర్మాతలతో నాకు మంచి జర్నీ ఉంది. ఈ సినిమా నేను చూశాను. ఈ సినిమా చూసిన వారందరూ హీరో బాలు ప్రేమలో పడతారు. బాలుకు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. నిర్మాతలు ఎంతో నిజాయితీగా ఒక మంచి ప్రయత్నం చేశారు. సినిమాను ఎలా తీయాలో నేర్చుకుని వచ్చి నిర్మాతలు ఈ సినిమా తీశారు. ఇది ఫ్యామిలీ డ్రామానే కాదు, ఒక మంచి యూత్‌ఫుల్ సినిమా. అందర్నీ అలరిస్తుంది” అని చెప్పారు.
సాహు గారపాటి మాట్లాడుతూ, “ఈ సినిమా అందరి డ్రీమ్స్‌ను నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది. హీరో అన్నింట్లో శిక్షణ తీసుకుని చేశారు. అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అందరికీ శుభారంభాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
నిర్మాత మనోజ్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. సినిమా చేసిన వాళ్లంతా టెక్నీషియన్స్ వర్క్స్‌ను కూడా అప్రిషియేట్ చేస్తారు. అందరూ సినిమాకు బెస్ట్ ఇచ్చారు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను ఫీల్ అయ్యాం” అని తెలిపారు.
మరో నిర్మాత కిషోర్ తాటికొండ మాట్లాడుతూ, “ఈ మూవీ ఒక మ్యూజికల్ జర్నీ. బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి. డీఓపీ ప్రతిభను అందరూ ప్రశంసిస్తారు. అందరూ తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎలాంటి హింసకు తావు లేకుండా రూపొందిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ కుటుంబంతో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది” అని అన్నారు.
హీరో బాలు మాట్లాడుతూ, “నారా రోహిత్, సాహు గారపాటిల సలహాలతో సినీ పరిశ్రమకు వచ్చాను. రోహిత్ అన్న గైడెన్స్ నాకు ఎంతో ఉపయోగపడింది. నా కోసం రోహిత్ అన్న 250 పేజీల కథ కూడా చదివాడు. దర్శకుడు సినిమాను ఎంతో బాగా తెరకెక్కించాడు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరి సపోర్ట్ నాకు కావాలి” అని కోరారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సాకేత్, హీరోయిన్ షిన్నోవా, కెమెరామెన్ కె నల్లి తదితరులు పాల్గొన్నారు.