‘షూట్ చేస్తున్న సన్నివేశాలను ఎలాగైనా లీక్ చేయాలనే కుట్రపూరిత భావన మనసులో ఉన్నప్పుడు.. మనం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. వాళ్ల అడ్డదారులు వాళ్లకుంటాయి. సెక్యూరిటీ కళ్లు కప్పడం పెద్ద విషయం కాదు.’ అని హీరో నాని అన్నారు. మహేశ్‌బాబుతో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన కొన్ని విజువల్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రీసెంట్గా హీరో నాని స్పందించారు. ఇంకా చెబుతూ ‘రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి సినిమా అంటే వివిధ శాఖల్లో వేలాదిమంది కళాకారులు పనిచేస్తుంటారు. లొకేషన్ని పరిశీలించడానికే ఓ టీమ్ ఉంటుంది. సెల్ఫోన్లు లొకేషన్లోకి అస్సలు అనుమతించరు. అయినా విజువల్స్ లీక్ అయ్యాయి.
ఇక్కడ మనం ఎవ్వరినీ నిందించలేం. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్లకు కూడా అంతుచిక్కని విషయాలు అక్కడ జరుగుతాయి. చెకింగ్ టైమ్‌లో సెల్‌ఫోన్ తీసి సెక్యూరిటీకిచ్చేస్తారు. వాళ్లేమో ఫోన్ తీసుకుని లోపలికి వదిలేస్తారు. అయితే.. ఆ వెళ్లిన వాళ్ల దగ్గర మరో ఫోన్ ఉంటుంది. ఎవ్వరికీ తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసేస్తారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జేబులోంచి ఫోన్ తీసి ఇచ్చేసిన తర్వాత.. మరో ఫోన్ వాళ్ల దగ్గర ఉంటుందని సెక్యూరిటీ వాళ్లయినా ఎలా ఊహిస్తారు చెప్పండి?!. ఏదేమైనా ఈ విషయంలో సెక్యూరిటీవాళ్లను ఇంకాస్త అప్రమత్తంగా, మరింత కఠినంగా ఉండమంటే.. ఇలాంటివాటిని కొంతవరకూ అడ్డుకట్ట వేయవచ్చు.’ అంటూ చెప్పుకొచ్చారు నాని.