Nani | ఇప్పుడు టాలీవుడ్ స్థాయి ఓ రేంజ్‌కి వెళ్లింది. మన హీరోలు చేస్తున్న సినిమాలపై ఇతర ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే మన హీరోలు ఎంత ఎత్తుకి ఎదిగిన కూడా అందరు కలిసి అన్యోన్యంగా ఉంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. టాలీవుడ్ టాప్ హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా మరో 142 మంది నటులతో వాట్సాప్ గ్రూప్ ఉందట. ఆ గ్రూప్‌లో మంచు లక్ష్మి కూడా ఉన్నారట. ఈ గ్రూప్‌ను ఎందుకు క్రియేట్ చేశారో కూడా ఒకానొక సందర్భంలో మంచు లక్ష్మీ వెల్లడించింది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకే ఈ గ్రూప్ ఉందని, అలానే నటీనటులు తమ లేటెస్ట్ సినిమాలను ప్రమోట్ చేయడానికి, రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించి విషయాలను మాట్లాడటానికి ఈ గ్రూప్‌ను వినియోగిస్తారంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ యాక్టివ్‌గా ఉందా లేదా అనే విషయాన్ని తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇప్పుడు ఆ గ్రూప్ అంత యాక్టివ్‌గా ఉందని నేను అనుకోవడం లేదు. ప్రారంభించిన కొత్తలో యాక్టివ్‌గా ఉండేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా మంది స్టార్స్ తమ ఫోన్ నెంబర్స్ మార్చేశారు. అప్పట్లో ఎక్కువగా పోస్ట్‌లు పెట్టేవారు. కాని ఇప్పుడు తగ్గించారు. అందుకు కారణం తెలియదు. అందరికి ఆ గ్రూప్‌పై ఆసక్తి తగ్గింది అని నాని అన్నారు.
ఆ గ్రూప్ క్రియేట్ చేయడానికి కారణం అందరం టచ్‌లో ఉండాలని పెట్టుకున్నాం. జోకులు, వివిధ విషయాల గురించి చర్చించే వాళ్లం. దేశాన్ని కాపాడుదాం, ఏదో పోరాడదాం అనే దాని కోసం ఈ గ్రూప్ క్రియేట్ చేయలేదు. ఒకరిని ఒకరం ప్రోత్సహించుకోవడానికి ఈ గ్రూప్ క్రియేట్ చేశాం. ఇందులో సినిమా ట్రైలర్స్ షేర్ చేసే వాళ్లం, అలానే వాటిపై స్పందనలు తెలియజేసే వాళ్లం. కాకపోతే పదేళ్ల క్రితం యాక్టివ్‌గా ఉన్నవారంతా ఇప్పుడు లేరు . స్పామ్ మెసేజ్‌లు ఎక్కువయ్యాయి. అందుకే గ్రూప్ మ్యూట్‌లో ఉంటుంది. ఏదైన ఓ వ్యక్తి ఓ అంశం గురించి మాట్లాడితే అది ఎక్కడికో పోతుంది. అందరికి పనులు ఉన్నాయి. నేను ఫోన్ ఎప్పుడు ఓపెన్ చేసిన కూడా 60 నుండి 70 అన్‌రీడ్ మెసేజెస్ కనిపిస్తాయి. తెల్లారే సరికి వంద కనిపిస్తాయి. వాటిని చూడకుండా వదిలేసాం అంటే అందులో మీరు భాగం కానట్టే అని నాని సరదాగా చెప్పుకొచ్చారు.