Tourist Family Movie | తమిళం నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు స్టార్ హీరో నాని ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
‘సింపుల్‌గా ఉండి, హృదయపూర్వకంగా.. ఎంతో మంచిని పంచే సినిమాలు మనకు కావాలి. #TouristFamily అలాంటి చిత్రమే. ఈ అద్భుతమైన సినిమాను రూపొందించిన నటీనటులకు, చిత్రబృందానికి ధన్యవాదాలు. ఇది చాలా అవసరం’. అంటూ నాని రాసుకోచ్చాడు.
ఈ ట్వీట్ చూసిన టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ నాని ప్రశంసలకు బదులిస్తూ “సర్, ఇది పూర్తిగా ఊహించనిది! మీరు చూపిన ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు. మీ ట్వీట్ నిజంగా మా రోజును అద్భుతంగా మార్చింది! మేము మరింత కృతజ్ఞతగా, చాలా ప్రేరణతో ఉన్నాము అంటూ రాసుకోచ్చాడు.
Simple, heart warming films with lot of goodness is what we deserve and #TouristFamily delivers just that. ♥️
Thanking the whole cast and crew who made this gem of a film. Much needed.— Nani (@NameisNani) May 26, 2025
నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). నటులు యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా.. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్, ధనుష్, ఎస్.ఎస్ రాజమౌళి, సూర్య సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(refugee)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.