కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల్లో వైవిధ్యం, పాత్రపోషణలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ విలక్షణ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు నాని. ఆయన నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మాతలు. నేడు అమెజాన్ప్రైమ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నాని పాత్రికేయులతో ముచ్చటించారు.
ప్రస్తుతం ఉన్న కరోనా అనిశ్చిత పరిస్థితుల కారణంగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాం. నాకు థియేటర్లో సినిమా చూడటమే ఇష్టం. బిగ్‌స్క్రీన్‌ను మిస్ అవుతున్నానని నేనూ ఫీలవుతున్నా.
ఇంట్రడక్షన్ అదిరింది..
తొలుత దర్శకుడు శివ ఈ సినిమా కథ మొత్తం కాకుండా ఓపెనింగ్ లైన్‌తో పాటు ఆరంభ సన్నివేశం గురించి చెప్పాడు. ‘మగపిల్లాడు ఏడవకూడదు. ఆడపిల్లను ఏడిపించకూడదు. అది ఇంటికి, ఊరికి మంచిది కాదు..’ అనే సంభాషణతో చెప్పిన ఇంట్రడక్షన్ సీన్ నన్ను కట్టిపడేసింది. వెంటనే సినిమా ఓకే చేశా. హీరో జగదీష్ చిన్నప్పటి నుంచి టక్ వేసుకునే కనిపిస్తాడు. అదే సినిమా టైటిల్‌గా పెట్టాం. ఈ సినిమాలో నా మేనకోడలు చంద్రమ్మగా ఐశ్వర్యరాజేష్ కనిపిస్తుంది.
కొత్త నానిని చూస్తారు
కెరీర్ తొలినాళ్లలో నేను కామెడీ సినిమాలు బాగా చేశాను. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, నిన్నుకోరి, జెర్సీ వంటి ఎమోషనల్ కథల్ని ఎంచుకున్నా. విరామం లేకుండా సినిమాలు చేస్తున్నా. ఈ క్రమంలో విభిన్నమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ నటుడిగా నన్ను నేను పరీక్షించుకుంటున్నా. ఇక నుంచి ప్రతి సినిమాలో కొత్త నానిని చూస్తారు. కథాంశాల పరంగా అన్నీ సర్‌ప్రైజ్‌లే ఉంటాయి.
సినిమాను ఏదీ కొట్టలేదు
రాబోవు రెండేళ్లలో పాన్ఇండియా అనే మాట వినపడదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల కంటెంట్ ప్రధానమైన అన్ని భాషల సినిమాల్ని చూస్తున్నారు. పాన్ఇండియా అని ఆలోచించకుండా వినూత్న కథలపై దృష్టి పెడితే మంచి ఫలితాల్ని సాధించవొచ్చు. ఓటీటీలకు అలవాటు పడి ప్రేక్షకులు థియేటర్లను మర్చిపోతున్నారనే భావనలో అర్థం లేదు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి థియేటర్లు ఓపెన్ అయితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. బిగ్‌స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ను కొట్టే ఛాన్స్ ఈ ప్రపంచంలో దేనికీ ఉండదని నా అభిప్రాయం.