నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడు. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నది. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమాలో ‘గాజు బొమ్మ’ అనే రెండో గీతాన్ని శుక్రవారం అగ్ర హీరో మహేష్‌బాబు విడుదల చేశారు.
‘నన్ను కదిలించినట్లే ప్రతీ తండ్రిని హత్తుకునే పాట ఇది. ‘హాయ్ నాన్న’ టీమ్‌కు నా శుభాకాంక్షలు’ అని మహేష్‌బాబు పేర్కొన్నారు. ‘ఇటు రావే నా గాజు బొమ్మ..నేనే నాన్న అమ్మ.. యద నీకు ఉయ్యాల కొమ్మ..నిను ఊపే చెయ్యే ప్రేమ..వాలిపో ఈ గుండెపైనే..ఆడుకో ఈ గూటిలోనే..’ అంటూ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ గీతానికి అనంత్‌శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్.