నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘దసరా’. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గర్లోని ఓ గ్రామం నేపథ్య కథతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేమ కథలో మాస్, యాక్షన్ అంశాలతో పాటు తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ ఆటలు సాగుతుండగా..‘ధరణిగా పెట్టి పుట్టాల్రా నా కొడకా..’ అంటూ వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ చెప్పిన సంభాషణతో మొదలైంది ట్రైలర్. నచ్చిన పని చేస్తూ, అడ్డొస్తే ఎదిరిస్తూ మాస్ అవతార్‌లో కథానాయకుడు చెలరేగిపోవడం సినిమాపై ఆసక్తి రేపింది. పాత్రలు, వేషభాషలు, తెలంగాణ స్థానికతను తెరకెక్కించడంలో స్వచ్ఛత కనిపించింది. ప్రతినాయకులను విధ్వంసం చేసే ధరణి ‘ఎట్లయితే గట్లాయో సూస్కుందాం బాంచత్’ అనే డైలాగ్ పతాక సన్నివేశాలను ప్రతిబింబించింది. మొత్తంగా నానిని ఇంతకుముందెప్పుడూ చూడని కోణంలో ఈ సినిమా ఆవిష్కరించనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తున్నది.