Nani | నాని.. ఈ పేరు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, తన టాలెంట్, కష్టంతో నేచురల్ స్టార్ స్థాయికి ఎదిగారు. ప్రతి పాత్ర కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే నాని డెడికేషన్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న అవైటెడ్ మూవీ ప్యారడైజ్ కోసం నాని పడుతున్న కష్టం గురించి ఆయన జిమ్ ట్రైనర్ విశ్వ భరత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న విశ్వ భరత్.. నానితో తన ప్రయాణం ఎలా మొదలైందో చెప్పుకొచ్చాడు. హిట్ 2 సమయంలో నానితో పని చేయడం ప్రారంభించానని, అప్పటి నుంచి ఆయన డెడికేషన్‌ను దగ్గరగా చూస్తున్నానని వెల్లడించాడు. “నాని అన్న పని విషయంలో నిజంగానే రాక్షసుడు. సోషల్ మీడియాలో కొంతమంది ఆయనపై నెగెటివ్ కామెంట్లు చేస్తుంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడతారో నేను దగ్గరగా చూస్తున్నాను” అని విశ్వ పేర్కొన్నాడు.
ప్రస్తుతం ‘ప్యారడైజ్’ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోందని, ఆ సినిమా కోసం నాని తన శరీరాన్ని పూర్తిగా మార్చుకుంటున్నారని తెలిపాడు. “ఉదయం 5 గంటలకు లేచి, 6 గంటలకే సెట్స్‌లో ఉంటారు. సాయంత్రం 7 గంటల వరకు యాక్షన్ సీన్లు చేస్తూనే ఉంటారు. రోప్స్ కట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్‌ల వల్ల బాగా అలసిపోతారు. అయినా అక్కడితో ఆగరు” అని విశ్వ చెప్పాడు. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా నాని విశ్రాంతి తీసుకోకుండా వర్కౌట్ కొనసాగిస్తారని వెల్లడించాడు. సాయంత్రం ఆయన అసిస్టెంట్ నుంచి నాకు కాల్ వస్తుంది. నాని అన్న 40 నిమిషాలు ఇంట్లో ఉంటారు.. వర్కౌట్ చేస్తారు అని చెప్తారు. అప్పటికే ఉదయం నుంచి షూటింగ్లో అలసిపోయి ఉన్నా, మరో 45 నిమిషాలు కచ్చితంగా జిమ్ చేస్తారు. ఇవాళ వదిలేద్దాం అని ఎప్పుడూ అనరు అంటూ నాని క్రమశిక్షణను ప్రశంసించాడు.
నాని తన పాత్రల కోసం ఎంతగా కష్టపడతారో చెప్పేందుకు విశ్వ మరో ఉదాహరణ కూడా ఇచ్చాడు. జెర్సీ సినిమా కోసం నాని ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ తీసుకున్నారని గుర్తుచేశాడు. “ఆ సినిమాలో అర్జున్ పాత్ర కోసం ఆయన పూర్తిగా క్రికెటర్లా మారిపోయారు. ఆయన ఆట చూసి మాజీ భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా మెచ్చుకున్నారు. ‘నువ్వు నిజంగానే ప్రొఫెషనల్ క్రికెటర్లా ఆడావు’ అని చెప్పారట” అని విశ్వ వెల్లడించాడు. ఇప్పుడు ‘ప్యారడైజ్’లో జడల్ పాత్ర కోసం కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారని చెప్పాడు. విశ్వ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని అభిమానులు “ఇంత డెడికేషన్ ఉన్న హీరోకే విజయాలు వస్తాయి , నేచురల్ స్టార్ అంటే ఇదే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.