Nandini | కన్నడ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటి, 26 ఏళ్ల సి.ఎం. నందిని బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో తాను నివసిస్తున్న వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన కన్నడ చిత్ర, టెలివిజన్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందిని మృతి చెందిన గదిలో ఆమె రాసిన ఒక డైరీ నోట్ లభ్యమైంది.
ఆ నోట్లో ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, ఒత్తిడి స్పష్టంగా వ్యక్తమైందని పోలీసులు వెల్లడించారు. 2021లో తన తండ్రి మరణించిన అనంతరం, కారుణ్య నియామకం కింద నందినికి ప్రభుత్వ ఉద్యోగం లభించిందని, అయితే ఆ ఉద్యోగం తనకు ఇష్టం లేదని, నటన మరియు సృజనాత్మక రంగంపైనే తన జీవితం ఆధారపడి ఉందని ఆమె నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.నటన వైపు కెరీర్ను కొనసాగించాలని నందిని కోరుకున్నప్పటికీ, కుటుంబ సభ్యులు మాత్రం స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంలోనే కొనసాగాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. తన కెరీర్ ఎంపికలను కుటుంబం అర్థం చేసుకోవడం లేదని, ఇష్టం లేని పనిని బలవంతంగా చేయాల్సి వస్తోందని ఆమె డైరీలో ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కన్నడ టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించాలన్న ఆమె కలలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య జరిగిన అంతర్గత పోరాటమే ఈ విషాదానికి దారి తీసినట్లు భావిస్తున్నారు. నందిని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె రాసిన డైరీ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కెరీర్ ప్రారంభ దశలోనే మంచి భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంపై ఆమె సహచర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.