YVS Chowdary New Film | వైవీఎస్ చౌదరి.. ఈ పేరు ఇప్పటి తరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్ లాంటి సూపర్ హిట్ మాస్ చిత్రాలను తెరకెక్కించింది ఈయనే అని గుర్తు చేస్తే తెలుస్తుంది. ఎంతోమంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు నందమూరి తారక రామారావు కుటుంబం నుండి మరో కొత్త నటుడిని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు.
ఎన్టీఆర్ నట వారసుల్లో నాలుగో తరం, నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్ కుమారుడు) అయిన నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్ కాదు) హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్గా నటించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించనుండగా, చంద్రబోస్ సాహిత్యం సమకూరుస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నేడు తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్‌లో పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. భువనేశ్వరి క్లాప్‌కొట్టి సినిమాను ప్రారంభించింది. కాగా.. నందమూరి కుటుంబం నుండి వస్తున్న మరో వారసుడు కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వైవీఎస్ చౌదరి ఈ యంగ్ టాలెంట్‌ను ఎలా పరిచయం చేస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రం 1980ల నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు వైవీఎస్ చౌదరి తెలిపారు. ఈ సినిమా తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.