‘బాలకృష్ణగారి కుటుంబంతో మా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. ఆయన నాకు తండ్రిలాంటి వారు. నన్ను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో దర్శకుడు బోయపాటి శ్రీను ఒకరు. బాలకృష్ణ-బోయపాటి కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిది అన్‌స్టాపబుల్ కాంబినేషన్’ అన్నారు అల్లు అర్జున్. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘అఖండ’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకులముందుకురానుంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ చూస్తే పూనకం వచ్చేలా అనిపిస్తుంది. బాలకృష్ణగారి అంత అద్భుతంగా సంభాషణలు చెప్పే వారు ఎవరూ లేరు. ఆయన తెరపై, బయట ఎక్కడైనా రియల్‌గానే ఉంటారు. సెకండ్‌వేవ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. ఈ సినిమా అఖండ జ్యోతిలా వెలుగునివ్వాలని కోరుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సినిమా గెలవాలని ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటున్నది. కొవిడ్ వచ్చినా దేవుడు దిగి వచ్చినా తెలుగు ప్రేక్షకులు తగ్గేదేలే’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఒక్కో మాట కలిస్తే అక్షరం అవుతుంది. అక్షరాలు కలిస్తే మంత్రం అవుతుంది. మంత్రాల ఔన్నత్యాన్ని, నవ పూజల విశిష్టతను చాటిచెప్పే చిత్రమిది. భక్తితత్వాన్ని ఎన్నో సినిమాలతో నాన్నగారు బతికించారు. ఆ పంథాను నమ్మి నేను చేసిన సినిమా ఇది. నాన్న ఎన్టీఆర్‌ను నేను గురువుగా, దైవంగా భావిస్తా. ఆ తర్వాత నా అభిమానుల్ని ప్రేమిస్తాను. నా నుంచి ఏదీ ఆశించకుండా కష్టాల్లో నాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తున్నది అభిమానులే. జయాపజయాల దైవాదీనాలు. విజయాలను చూసి గర్వపడను. పరాజయాల్ని చూసి ఏ రోజు కృంగిపోను. కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఈ సినిమా చేశాం. ‘అఖండ’తో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’, రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలు విజయవంతం కావాలి. సినీ పరిశ్రమకు అండగా నిలవాలని ఇరు రాష్ట్రప్రభుత్వాల్ని కోరుతున్నా’ అని తెలిపారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ “అఖండ’ సినిమాతో ఇండస్ట్రీకి మళ్లీ ఊపు వచ్చింది. బాలకృష్ణ ఓ ఆటంబాబు. ఆ బాంబును కరెక్ట్‌గా ఎలా ప్రయోగించాలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు. ఆ సీక్రెట్‌ను దర్శకులందరికి చెబితే బాగుంటుంది. బాలకృష్ణ ఎనర్జీ అద్భుతం. సినిమా విజయవంతమై ఇండస్ట్రీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి’ అని అన్నారు. క్లాస్, మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించే సినిమా ఇదని, బాలయ్య నటవిశ్వరూపాన్ని చాటిచెబుతుందని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.