Balakrishna | ఏదైనా ఒక సినిమా చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండిపోవడం మన హీరోలకు అలవాటే. అయితే బాలకృష్ణ లాంటి హీరోలు దానికి మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. తాజాగా భగవంత్ కేసరి విషయంలో ఇదే జరుగుతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా ఇది. దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది భగవంత్ కేసరి. శ్రీలీల ఇందులో ప్రధాన పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే బాక్సాఫీస్ బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే బాలకృష్ణ ఈ క్యారెక్టర్ నుంచి అంత ఈజీగా బయటికి రాలేకపోతున్నాడు. సినిమాలోనే కాదు.. బయట కూడా భగవంత్ కేసరిని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. ఇటు రాజకీయాల్లో కూడా ఈ సినిమా పేరు వాడుకుంటున్నాడు. మొన్న పెట్టిన పొలిటికల్ ప్రెస్మీట్లో బ్రో ఐ డోంట్ కేర్ అంటూ కేసరి మార్క్ డైలాగ్ చెప్పాడు బాలయ్య. అలాగే వరంగల్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా అచ్చం భగవంత్ కేసరి గెటప్‌లో వచ్చాడు. పూర్తిగా తెలంగాణ యాసలోనే మాట్లాడాడు.
ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా క్యారెక్టర్ బాలయ్యను ఎంతగా ఆకట్టుకుందనే అర్థం చేసుకోవచ్చు. పైగా ఇది సినిమా ప్రమోషన్లో భాగం కూడా కావచ్చు. రాజకీయంగానూ ఈ సినిమాను హైలైట్ చేస్తున్నాడు బాలయ్య. కచ్చితంగా ఇది తన కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందని ఆయన అంచనా. అన్నింటికీ మించి కెరీర్లో సుప్రీం ఫామ్‌లో ఉన్నాడు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి.
ఇప్పుడు భగవంత్ కేసరి కూడా హిట్ అయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ అందుకున్న ఘనత సాధిస్తాడు బాలయ్య. చివరగా 1993లో వరుసగా మూడు విజయాలు అందుకున్నాడు బాలయ్య. ఆ తర్వాత మళ్లీ ఆ రికార్డు ఆయన దరి చేరలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అవకాశం వచ్చింది. సీనియర్ హీరోలలో బాలకృష్ణ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకే భగవంత్ కేసరి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొత్తానికి చూడాలిక ఈ సినిమా ఏం చేస్తుందో..!