Nandamuri Balakrishna | దేశ రాజధాని వేదికగా బుధవారం ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’లో టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణకు అత్యున్నత పురస్కారం లభించింది. సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను, అంకితభావాన్ని గుర్తిస్తూ నిర్వాహకులు బాలయ్యను ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుతో సత్కరించారు. దిల్లీలోని ప్రతిష్టాత్మక ‘భారత్ మండపం’లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర తరపున వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే గౌరవాన్ని పొందారు.
ఈ మెగా ఈవెంట్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ప్రముఖ నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ మరియు కేంద్ర మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. దేశవిదేశాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాలుగా తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణకు జాతీయ స్థాయిలో దక్కిన ఈ గౌరవం ఆయన సినీ ప్రస్థానంలో మరొక మైలురాయిగా నిలిచిపోనుంది.