అగ్ర నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు బాలకృష్ణే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్లో బాలయ్యను సత్కరించనున్నారు. గత ఏడాది నటుడిగా 50ఏండ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ.. ఇప్పటికీ స్టార్ హీరోగానే కొనసాగుతున్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జానర్లలోనూ నటించిన ఏకైక నటుడు కూడా బాలకృష్ణే కావడం గమనార్హం. ఆయన నటించిన ‘లెజెండ్’ చిత్రం ఏకంగా 1000రోజులకు పైగా ప్రదర్శితమై అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాక, ఓవైపు నటుడిగా, మరోవైపు శాసనసభ్యునిగా, ఇంకోవైపు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ ఛైర్మన్గా బరువైన బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా జీవితంలోనూ కీలకంగా ఉన్నారు బాలకృష్ణ.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే ఆయనకు ఈ గౌరవం దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినీరంగానికి తాను చేసిన సేవలకు గాను, కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో ఆయన్ను గౌరవించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నటించిన ‘నేలకొండ భగవంత్ కేసరి’.. రీసెంట్గా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఈ వరుసలోనే ఆయనకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కూడా చోటు దక్కడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య కుమార్తె బ్రహ్మణి, నటుడు నారా రోహిత్ తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందించారు. ఏదేమైనా ఓ వైపు వరుస విజయాలతో రివార్డులు, మరోవైపు వరుసపెట్టి అవార్డులు.. మొత్తంగా బాలకృష్ణకు శుక్రమహర్దశ నడుస్తున్నదని చెప్పొచ్చు.