గత ఏడాది నవంబర్లో నానా పటేకర్ ‘వనవాస్’ సినిమా షూటింగ్ వారణాసిలో జరిగింది. అది అవుట్డోర్ షూటింగ్ కావడంతో షూటింగ్ చూడటానికి జనం ఎగబడ్డారు. షూటింగ్ మంచి రసపట్టులో ఉంది.. ఇంతలో సడెన్గా ఓ యువకుడు ఫీల్డ్లోకి చొరబడి నానా పటేకర్ పక్కన నిలబడి సెల్ఫీ దిగబోయాడు. దాంతో అసహనానికి లోనైన పటేకర్, ఆ కుర్రాడి తలపై గట్టిగా కొట్టారు.
వెంటనే సెక్యూరిటీ రంగంలోకి దిగి ఆ కుర్రాడ్ని పక్కకు లాగేసింది. అయితే.. ఈ తతంగాన్నంతా అప్పటికే పలువురు తమ ఫోన్ల ద్వారా వీడియోలు తీసేశారు. ఆ వీడియోలు విపరీతంగా ట్రోల్ అవ్వడంతో, దాని వల్ల నానా పటేకర్ తీవ్రమైన విమర్శలెదుర్కోవలసి వచ్చింది. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏడాది క్రితం జరిగిన ఈ విషయాన్ని నానా పటేకర్ గుర్తు చేసుకున్నారు.
‘నిజంగా నేను చాలా తొందరపడ్డాను. అప్పుడు నేను షాట్లో ఉన్నా. లొకేషన్ అంతా బిజీగా ఉంది. అలాంటి సమయంలో ఆ అబ్బాయి ఫొటో కోసం నా పక్కన నిలబడ్డాడు. అది తను తెలియక చేశాడు. ఆ విషయం గ్రహించకుండా నేను కొట్టడం తప్పే. అతను అభిమానంతోనే కదా నా దగ్గరకొచ్చాడు. షూటింగ్ గ్యాప్లో ఆ కుర్రాడు నా దగ్గరకు వచ్చి ఉంటే నా స్పందన వేరేలా ఉండేది’ అన్నారు నానా పటేకర్.