Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 27 వరకు కస్టడీ విధిస్తూ 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పుష్పస్టార్ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నటుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ నెల 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు గాయపడ్డాడు. మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండుగంటల పాటు విచారించారు. ఆ తర్వాత 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.
సంధ్య థియేటర్ వ్యవహారంలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టులో వాదనల సందర్భంగా అల్లు అర్జున్ తండ్రి, ప్రమఖ నిర్మాత అయిన అల్లు అరవింద్.. మరో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం హైకోర్టులోనే ఉన్నారు.