కోలీవుడ్‌లో కూసిన తెలుగు ‘పందెం కోడి’ విశాల్. యాక్షన్ సినిమాల్లో ఆయన చూపించే ‘పొగరు’ పొరుగు రాష్ర్టాల్లోనూ కలెక్షన్లు కురిపిస్తుంది. ‘డిటెక్టివ్’గా ఆయన నటన ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ హోరుకు విజయాలు కొత్త కాదు, ఆయన ప్రస్థానంలో వివాదాలకు లెక్కలేదు. ఎన్ని చిక్కులున్నా చక్కగా తన పని తాను చేసుకుపోయే హీరో విశాల్. దర్శకుడు కావాలన్న తన చిరకాల వాంఛ ఈ ఏడాదితో నెరవేరుతున్నది. ఈ సందర్భంగా విశాల్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
నేను నటనవైపు రావడానికి కారణం మా నాన్నే! మొదట్లో నేను దర్శకుడు కావాలని కోరుకునేవాణ్ని. కానీ, సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్న మా నాన్న నన్ను నటనపై దృష్టి సారించమని చెప్పారు. ‘నీది హీరో ఫేస్‌కట్’ అని తరచూ అంటుండేవారు. ప్రతి సందర్భంలో నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపించారు. కుటుంబం కూడా మద్దతుగా నిలిచింది. నాన్న మాటమీద 2004లో ‘సెల్లమే’ సినిమాలో తొలిసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. అది ఘన విజయం సొంతం చేసుకుంది. ఆ చిత్రమే తెలుగులో ‘ప్రేమ చదరంగం’ పేరుతో విడుదలై విజయం సాధించింది. ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎప్పటికైనా దర్శకుణ్ని కావాలనే నా కోరిక ఈ ఏడాది నిజమవుతున్నది.
సినిమా ఇండస్ట్రీ కొత్త టాలెంట్‌ను కోరుకుంటున్నది. సినిమాల్లోకి రావడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా అవుతున్నది. నేటి యువకుల ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే, పాతికేండ్లతో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు రావడం తేలికేమో కానీ, నిరూపించుకోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పటి జనరేషన్‌కు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని తట్టుకుని నిలబడితేనే ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉంటుంది.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను బాగా ఆదరించారు.
‘పక్కింటి అబ్బాయి’లా ఉన్నావని అంటుండేవారు. యాక్షన్ హీరోగా మారిన తర్వాత కూడా వారి అభిమానం అలాగే కొనసాగింది. ఇప్పటికీ నన్ను అలాగే భావిస్తుండటం నా అదృష్టమనే చెప్పాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా అభిమానులు నన్ను ఆదరిస్తున్న తీరుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కన్నా ఏం చేయగలను? ఇలాంటి అవకాశం సినిమాల వల్లే దక్కింది. రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి దిగ్గజ నటులున్న సినీ పరిశ్రమలో నేనూ ఉన్నానంటే నమ్మబుద్ధి కాదు. అప్పుడప్పుడూ నన్ను నేను గిల్లుకొని ఇది నిజమే అనుకుంటా!
మొదటి సినిమా షూటింగ్లో గాయ
పడినప్పుడు కొన్ని కుట్లు పడ్డాయి. ఈ ఇరవై ఏండ్లలో మొత్తం 109 కుట్లుపడ్డాయి. ఆ గాయాల తాలూకు మచ్చలను నా నటనకు గుర్తింపుగా భావిస్తుంటా. ఇటీవల ‘లాఠీ’ షూటింగ్‌లోనూ గాయపడ్డాను. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. స్టంట్స్‌లో నేను డూప్‌ను అంగీకరించను. అలాగే రెండో టేక్కు వెళ్లాలనీ అనుకోను. ‘లాఠీ’ చిత్రంలో నాలుగు అంతస్తుల పైనుంచి దూకే స్టంట్ ఒకటి ఉంది. కావాల్సినన్ని కెమెరాలు పెట్టాల్సిందిగా కెమెరామెన్‌కు ముందుగానే చెప్పాను. ఆ షాట్ రీటేక్ చేయాలంటే మరోసారి సాహసం చేయాల్సిందే కదా!
ముందు నుంచీ నాకు యాక్షన్ సినిమాలంటేనే ఇష్టం. అందుకు తగ్గట్టే అలాంటి చిత్రాల్లోనే ఎక్కువగా నటించాను. సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకైతే అలాంటి సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ తరహా సబ్జెక్ట్ వస్తే మాత్రం మిస్సవ్వను.
కథ నచ్చాకే సినిమా చేయడానికి అంగీకరిస్తా. నేను నటించిన ప్రతి చిత్రం నాకు నచ్చిందే! ప్రతి షూటింగ్‌నూ బాగా ఎంజాయ్ చేస్తా. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటా. ఇన్నేండ్లు ఇండస్ట్రీలో ఉండటానికి అదే కారణం. మరో విషయం.. నటుడు అనేవాడు నిత్య విద్యార్థి. ‘నాకు అన్నీ వచ్చు’ అనుకున్న క్షణం నుంచే పతనం మొదలవుతుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలనే
ఎక్కువగా ఎంచుకుంటా.
2023లో ఫ్రెంచ్ నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నది. దర్శకత్వం కొనసాగించాలని కోరుకుంటున్నా. నా రెండు లక్ష్యాలూ నెరవేరుతాయని ఆశ.
తెరమీదే నేను హీరో. ఇంటికి వచ్చానంటే చాలా కామన్‌గా ఉండటానికి ఇష్టపడతాను. ఫ్యాషన్ ట్రెండ్స్ పెద్దగా ఫాలోకాను. జీన్స్, టీషర్ట్ ధరిస్తుంటా. ఎంత సింపుల్‌గా ఉంటే అంత ఇష్టం.
సూపర్ పవర్ వస్తే..
నీకు ఎలాంటి శక్తులు కావాలో కోరుకోమంటే.. మనసుకు నచ్చిన చోటుకు మరుక్షణంలో వెళ్లిపోయే సూపర్ పవర్ కావాలంటా. ఒక మహిళ మనసులో ఏమనుకుంటుందో తెలుసుకుంటా. విజయం వెనకున్న నిజమైన రహస్యమేంటో కనుగొంటా.