‘వేవ్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఇందులో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆడియో, విజువల్ రంగం గురించి, విజువల్ మీడియా మరియు కంటెంట్ క్రియేషన్‌లో హైదరాబాద్ ఓ శక్తివంతమైన కేంద్రంగా ఆవిర్భవించిన వైనాన్ని, వివిధ సినీ స్టూడియోల సమాచారాన్ని పొందుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున సమకాలీన సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నేటితరం ప్రేక్షకులు హీరోలను లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారని, బాహుబలి, పుష్పరాజ్..రాఖీ (కేజీఎఫ్) సినిమాల భారీ విజయానికి అదే కారణమని చెప్పారు. ‘మెజారిటీ ప్రేక్షకులు ఒత్తిడి పోగొట్టుకునేందుకు సినిమాలకు వస్తున్నారు. వారు నిజ జీవితానికి భిన్నంగా తెరపై జరిగే మ్యాజిక్‌ను చూసేందుకే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.
నేనూ అలాంటి సినిమాలనే ఇష్టపడతా. అయితే కేవలం హీరోల ఎలివేషన్స్‌తోనే అలాంటి సినిమాలు ఆడటం లేదు. వాటిలో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటున్నాయి’ అని నాగార్జున అన్నారు. ఆదివారం వరకు జరిగే వేవ్స్ సమ్మిట్‌లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. శుక్రవారం అమీర్‌ఖాన్, కరీనాకపూర్, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.