అగ్ర నటుడు అక్కినేని నాగార్జున నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుండగా, మరో సినిమా రజనీకాంత్ ‘కూలీ’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ రెండు సినిమాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు నాగార్జున. ముందుగా ‘కుబేర’ గురించి చెబుతూ.. ‘నాకిష్టమైన టాలీవుడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాలన్నీ చూశా. శేఖర్ కథలు భిన్నంగా ఓ ప్రత్యేకమైన జానర్లో ఉంటాయి. ‘కుబేర’ కథతో ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు, కథ విని ‘నిజంగా నువ్వు ఈ సినిమా చేయాలనుకుంటున్నావా?’ అనడిగాను. ఎందుకంటే, తన ైస్టెల్కి ఈ కథ పూర్తి భిన్నంగా ఉంది. ఎంతో రీసెర్చ్ చేస్తే తప్ప ఇలాంటి కథ రాయలేరు.
సినిమా ఒప్పుకున్న తర్వాత ఎలా తీస్తాడో అనుకున్నా. కానీ అత్యద్భుతంగా తీశాడు. ఈ సినిమాలో శేఖర్ చెప్పిన కొన్ని విషయాలు చూసి షాకయ్యా. పేద, ధనిక, మధ్యతరగతి కుటుంబాలలో జరుగుతున్న విషయాల్ని ఆసక్తికరంగా చెప్పాడు. న్యాయంపై తనకున్న బలమైన నమ్మకం ఇందులో కనిపిస్తుంది. అందుకని ఏ స్కామ్నో, లేక ఏ ఒక్కరినో ఆధారంగా చేసుకుని రాసిన కథ కాదు ఇది.’ అని పేర్కొన్నారు. ‘కూలీ’ గురించి చెబుతూ ‘ఇది పూర్తి స్థాయి రజనీ మార్క్ విజిల్ మూవీ. ఇందులో నా పాత్ర ఎంతో కీలకం. ఫస్ట్‌టైమ్ విజువల్స్ చూసినప్పుడు అది నేనేనా? అనిపించింది. లోకేష్ ‘విక్రమ్’లో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి పాత్రలు ఎలాగైతే ఆడియన్స్‌కి గుర్తుండిపోయాయో.. అలాగే ఇందులోని ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది’ అని చెప్పుకొచ్చారు నాగార్జున.