Nagarjuna | సినీ తారలు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డిసెంబర్ 4న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో వేదికగా ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనయుడు నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల ప్రేమాయణం గురించి ఆసక్తికరమై విషయాలను వెల్లడించారు అగ్ర నటుడు నాగార్జున. వారి ప్రేమకు తాను వారధిగా వ్యవహరించానని సరదాగా చెప్పుకొచ్చారు. శోభితా అద్భుతమైన నటి అని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఎంతో గౌరవమని కాబోయే కోడలిని మెచ్చుకున్నారు నాగార్జున.
ఆయన మాట్లాడుతూ ‘శోభితా అద్భుతమైన నటి. ఓ సినిమాలో ఆమె యాక్టింగ్ బాగా నచ్చింది. దాంతో వెంటనే ఫోన్ చేసి అభినందించా. ఆ తర్వాత తను హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించాను. మా ఇద్దరి మధ్య సినిమాలతో పాటు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. ఆ సమయంలో చైతన్య అక్కడకు వచ్చాడు. అప్పుడే వారిద్దరికి తొలి పరిచయం ఏర్పడింది. ఓరకంగా నావల్లే వాళ్లిద్దరూ కలిసారనుకుంటున్నా (నవ్వుతూ)’ అన్నారు నాగార్జున. ఇదిలా వుండగా పెళ్లి కోసం అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని సమాచారం.