Nagarjuna | అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన శైలితో స్టార్ హీరోగా ఎదిగారు. రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, యాక్షన్, మాస్, భక్తిరస చిత్రాల వరకు అన్ని జానర్లలో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. దశాబ్దాల కెరీర్లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగ్ ఇప్పుడు తన కెరీర్లో అత్యంత కీలకమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘నా సామిరంగ’ సినిమా తర్వాత వెంటనే 100వ సినిమా మొదలుపెట్టాల్సి ఉన్నా, ఇది మైలురాయి చిత్రం కావడంతో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాస్త ఆలస్యం చేశారు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన ఖాళీగా మాత్రం లేరు.
ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, విలన్ రోల్స్ చేయడంతో పాటు బిగ్ బాస్ లాంటి షోలతో కూడా ఆడియన్స్‌కు ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉన్నారు. ఇటీవల ‘కుబేర’, ‘కూలీ’ సినిమాల్లో నటించి తన యాక్టింగ్‌తో మరోసారి ప్రశంసలు అందుకున్న నాగార్జున, ఇప్పుడు 100వ సినిమా విషయంలో పూర్తిగా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ మైలురాయి చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కేరళలో జరగనున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇటీవల ‘కూలీ’ సినిమాలో నాగార్జున కనిపించిన హెయిర్ స్టైల్‌తోనే ఈ చిత్రంలో కూడా కనిపించనున్నారట. ఇది ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
ఇక ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా ఏ జానర్లో రూపొందుతోందన్న విషయంపై మాత్రం ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. నాగార్జున 100వ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన నాగ్ ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు.