Nagarjuna-Mahesh Babu| టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు వంటి వారు మల్టీ స్టారర్ సినిమాలు చాలానే చేశారు. ఆ తర్వాతి తరంలో ఈ ట్రెండ్ కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు వెంకటేష్ మల్టీ స్టారర్ ట్రెండ్ తీసుకురాగా, బడా హీరోలు సైతం మల్టీ స్టారర్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కింగ్ నాగార్జున తన కెరియర్లో కార్తీతో కలిసి ఊపిరి అనే మల్టీ స్టారర్ చేశారు. ఆ తర్వాత నానితో దేవదాస్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌తో కలిసి నా సామిరంగా వంటి చిత్రాలు చేశారు. ఇక ఇప్పుడు కూలీ, కుబేరా చిత్రాలలో రజనీకాంత్, ధనుష్‌లతో కలిసి పని చేస్తున్నారు.
అయితే నాగార్జున మహేష్ బాబుతోనూ ఓ సినిమా చేయాల్సి ఉండే. అ కానీ దర్శకుడు హ్యాండివ్వడంతో ఈ కాంబినేషన్ మిస్ అయ్యింది. వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్టీ స్టారర్ ట్రెండ్‌కి హైప్ తెచ్చింది ఈ చిత్రం. ఇటీవలే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా, మంచి ఆదరణ దక్కిచుకుంది. అయితే ఈ చిత్రంలో తండ్రి ప్రకాష్ రాజ్ పాత్ర కోసం మొదట రజనీకాంత్‌ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలిసారు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రకాశ్ రాజ్ ని తీసుకున్నారు.
ఇక వెంకటేష్ పాత్రకి ముందుగా నాగార్జునని అనుకున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మొదట నాగార్జున దగ్గరికి వెళ్లి ఇలా మల్టీస్టారర్ కథ ఉందని, విలేజ్ బ్యాక్ డ్రాప్లో చిన్న లైన్ చెప్పాడట శ్రీకాంత్ అడ్డాల. కథని ప్రిపేర్ చేసే క్రమంలో సురేష్ బాబు నుంచి ఫోన్ వచ్చింది. సురేష్ బాబు, వెంకటేష్ లు ఓ సినిమా చేద్దామని చెప్పగా, దర్శకుడు శ్రీకాంత్.. నాగార్జునకి చెప్పిన కథని కాస్త పొడిగించి చెప్పాడు. వారికి నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. ఆ తర్వాత దిల్ రాజు పిలిచారు. ఆయనకు మరికొంత కథని చెప్పారు. ఆయనకి నచ్చడం వెంటనే స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేయడం, మహేష్‌ని ఒప్పించడం ఇవ్వన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే దర్శకుడు నాగార్జున మాటని కాదని, వెంకీ వద్దకు వెళ్లి, మహేష్ తో కలిసి ఈ మూవీని చేశాడు. లేదంటే నాగార్జున, మహేష్ కాంబోలో ఈ సినిమా వచ్చేది.