Nagarjuna | అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్ర బృందం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్మీట్లో హీరో అఖిల్‌తో పాటు నటీనటులు, సాంకేతిక బృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున కూడా ఈ కార్యక్రమానికి హాజరై మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ.. గతంలో మీడియా సమావేశాలు ఎలా ఉండేవో, ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయాయో నాగార్జున వివరించారు.
మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా కెరీర్ ప్రారంభ రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో ఒక సినిమా రిలీజ్‌కు ముందు కేవలం కొద్దిమంది జర్నలిస్టులు, ఒక ఫొటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారు. ఫోన్లు, లైవ్ రికార్డింగ్‌లు, సోషల్ మీడియా ఏవీ ఉండేవి కావు. మీడియాతో చాలా ప్రశాంతంగా మాట్లాడే అవకాశం ఉండేది అని అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నాగార్జున పేర్కొన్నారు. ఇప్పుడు మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. ఎవరు ఏ ప్రశ్న అడుగుతారో, ఎక్కడ ఏ కెమెరా రికార్డ్ చేస్తుందో తెలియదు. చిన్న మాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే చాలాసార్లు ఏం మాట్లాడాలో ఆలోచిస్తూ ఫ్రీజ్ అయిపోతుంటాం అని చెప్పుకొచ్చారు.
నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ యుగంలో సెలబ్రిటీలపై ఉన్న నిరంతర కెమెరాల నిఘా, సోషల్ మీడియా ప్రభావాన్ని ఆయన సరదాగా వివరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం.. జూలై 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ చిత్రంతో అఖిల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటాడా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.