Nagarjuna | తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ గ్రేసీ సింగ్. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ నాగార్జున నటించిన సంతోషం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. సంతోషం చిత్రంలో నాగ్, గ్రేసీ సింగ్ జోడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత గ్రేసీ సింగ్‌కి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సంతోషం స్థాయిలో హిట్స్ మాత్రం అందుకోలేదు.
హిందీలో కూడా పలు సినిమాలలో నటించింది గ్రేసీ సింగ్. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్ కలిసి నటించిన లగాన్ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. గ్రేసీ సింగ్ క్లాసికల్ డ్యాన్సర్ కాగా, ఆమె లగాన్ సినిమాతోపాటు.. మున్నా భాయ్ MBBS, గంగాజల్ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. హిందీ, తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో 2015 వరకు గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించిన గ్రేసీ సింగ్ ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. దాంతో వెండితెరకు దూరమై.. బుల్లితెరపై అడపా దడపా సీరియల్స్ చేసింది. 2021 నుండి సీరియల్స్ కూడా మానేసి ఆధ్యాత్మికం వైపు వెళ్లింది.
కొన్నాళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న గ్రేసీ సింగ్ బ్రహ్మ కుమారీ గా మారి ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. బ్రహ్మ కుమారిగా మారిన గ్రేసీ సింగ్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది గ్రేసీ. అలాగే తన పేరుతో గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్ కూడా ప్రారంభించి దేశ విదేశాలలో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే 44 ఏళ్లు వచ్చినా గ్రేసీ సింగ్ వివాహం చేసుకోలేదు. తన జీవితాన్ని నాట్యం, నటన మరియు ఆధ్యాత్మికతకు అంకితం చేసింది. తాను బ్రహ్మ కుమారిగా అపారమైన ఆనందం, శాంతిని పొందుతున్నట్టు పేర్కొంది. ఏది ఏమైన ఇలా గ్రేసీ సింగ్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.