అగ్ర నటుడు నాగార్జున శనివారంతో 40 ఏండ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘విక్రమ్’ 1986 మే 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నలభై వసంతాల చిరస్మరణీయ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నాగార్జున తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. గత నలభైఏండ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మే 23..ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్న చివరి చిత్రం ‘మనం’ 2014లో ఇదే రోజున విడుదలైంది. ఇందులో నాన్నతో పాటు నా తనయులిద్దరితో కలిసి నటించే అద్భుతమైన అవకాశం దక్కింది.
నలభైఏండ్ల క్రితం ఇదే రోజున నా తొలిచిత్రం ‘విక్రమ్’ మీ ముందుకొచ్చింది. ఈ సినిమా ద్వారా నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి మీ ప్రేమను పొందగలిగాను. ఈ సినిమా నాకు ఎంతో మంది అభిమానులను దగ్గర చేసింది. నా సుదీర్ఘ నట ప్రయాణంలో తోడుగా నిలిచి, ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.
భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రోజులను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున తన పోస్ట్‌లో తెలిపారు. ‘విక్రమ్’ చిత్రానికి వి.మధుసూధనరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొని నాగార్జున సినీ ప్రయాణానికి శుభారంభాన్నిచ్చింది. ప్రస్తుతం నాగార్జున తన వందో చిత్రం ‘కింగ్ 100’లో (వర్కింగ్ టైటిల్) నటిస్తున్నారు. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.