ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో కార్తికేయుడి ఇతివృత్తంతో భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’ అంటూ ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించిన దగ్గరి నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పౌరాణిక పాత్రల్లో తనదైన శైలి అభినయంతో మెప్పిస్తాడని ఎన్టీఆర్‌కు పేరుంది. దాంతో ఈ సినిమా విషయంలో ఆయన అభిమానులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెల్లడించారు. రామాయణం కంటే బిగ్ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని తెలిపారు.
ఈ సినిమా పూర్వ నిర్మాణ పనుల్లో దర్శకుడు త్రివిక్రమ్ బిజీగా ఉన్నారని చెప్పారు. ఇదిలావుండగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సైతం తన పాత్రను ఆకళింపు చేసుకునే ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. కొద్దిరోజుల క్రితం ఎయిర్‌పోర్ట్‌లోకి వెళుతూ ఎన్టీఆర్ తన చేతిలో మురుగన్ (కార్తీకేయుడి) ప్రాశస్త్యాన్ని తెలియజేసే పుస్తకాన్ని పట్టుకొని కనిపించారు ఎన్టీఆర్. హిందూ ధర్మంలో యుద్ధం, విజయానికి ప్రతీకలా భావించే శివుడి తనయుడు కార్తీకేయుడి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమవుతున విషయం తెలిసిందే.