War 2 | ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. ఇప్పుడు ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కాగా, టీజర్ విడుదల తరువాత కొంత మేర నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ ముమ్మరంగా మొదలవకపోవడం కూడా అభిమానుల్లో నిరాశ కలిగించింది.
తాజాగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్లు మళ్లీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆ సీన్ బాగా వచ్చింది. స్క్రీన్ చిరిగిపోతుంది!” అంటూ ఎన్టీఆర్ మాస్ ఎంట్రీపై భారీ క్రేజ్‌ను క్రియేట్ చేశారు. అభిమానులు ఆ సీన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా రైట్స్ ఎందుకు దక్కించుకున్నారనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. “హృతిక్ – ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటారనే ఆలోచనే నాకు బేస్. వారిద్దరి మధ్య వార్ ఎలా ఉంటుందో చూడాలని ఈ సినిమాను తీసుకున్నాను అని నాగవంశీ వెల్లడించారు.
ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. టెక్నికల్‌గా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వార్ 2’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో హిందీ డబ్ సినిమాల్లో ఇంత భారీ రేటుకు తెలుగు హక్కులు అమ్ముడైన సినిమా ఇదే కావడం విశేషం. హృతిక్, ఎన్టీఆర్ తలపడే సీన్ కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో హైప్ తెచ్చిపెట్టేలా ఉంటుందని మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు ధీమాగా చెబుతున్నారు. మరి ఈ కలయిక మ్యాజిక్‌ని సృష్టిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఆగస్టు 14వరకూ వేచి చూడాల్సిందే!