Custody | నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ప్రభు దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘టైమ్‌లెస్ లవ్’ లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు.
‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యిందిలా.. చూస్తూనే ఎంతో నచ్చేసింది బుజ్జి పిల్లా..జల్లులాయే జ్ఞాపకాల చినుకులు..తలచుకుంటూ తడిసిపోన చిన్ననాటి గురుతులు’ అంటూ తొలిప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకుంటూ, ప్రేయసి అందచందాల్ని వర్ణిస్తూ రెట్రో థీమ్‌లో ఈ పాట సాగింది. మాస్ట్రో ఇళయరాజా ఈ గీతాన్ని స్వరపరిచారు. యువన్‌శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఆలపించారు. ఇందులో నాగచైతన్య, కృతిశెట్టి జోడీ చక్కటి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అరవింద్‌స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్‌శంకర్ రాజా సంగీతాన్నందించారు.