Naga Chaitanya Thandel Movie | నటుడు అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం.
తండేల్ ప్రీ రిలీజ్ వేడుకను నేడు హైదరాబాద్‌లో నిర్వహించబోతుంది. అయితే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్రయూనిట్. ఈ వేడుకకు అల్లు అర్జున్ రానుడంటంతో అభిమానులకు అనుమతి లేదని తెలిపింది. సినిమా బృందం తప్ప బయటి వారు ఎవరు ఈ సినిమా వేడకకు రాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా వేడుకలో పాల్గోనబోతున్నాడు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం మీడియా ముందుకు రావడం చాలా తగ్గించాడు అల్లు అర్జున్. తాజాగా ఆయన తన తండ్రి నిర్మాణంలో వస్తున్న సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరుకాబోతున్నాడు.