Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సెలబ్రిటీ కపుల్ తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని ఘనంగా కాకుండా సింపుల్‌గా జరుపుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా నాగ చైతన్య, తన భార్య శోభితతో పాటు ఆమె సోదరిలతో కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఈ పిక్ అక్కినేని అభిమానులతో పాటు సాధారణ నెటిజన్లలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా మారడానికి ఓ ఆసక్తికర కారణం ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సెలబ్రిటీల ఫ్యామిలీ ఫోటోలు వైరల్ కావడం కామనే. కానీ ఈ ఫోటోలో శోభిత సోదరి కనిపిస్తుండగా, ఆమె పేరు ‘సమంత’ కావడమే నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. నాగ చైతన్య మరదలి పేరు సమంత ధూళిపాళ్ల కాగా, వృత్తిరీత్యా ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. చై – శోభిత పెళ్లి వేడుకల్లోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కాకతాళీయంగా చైతన్య మాజీ భార్య పేరు, రెండో భార్య సోదరి పేరు ఒకటే కావడంతో సోషల్ మీడియాలో దీనిపై విస్తృత చర్చ మొదలైంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో తొలిసారి కలిసి నటించిన నాగ చైతన్య – సమంత రూత్ ప్రభు ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో నాలుగేళ్లు తిరక్కుండానే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
అనంతరం రెండేళ్ల గ్యాప్ తర్వాత చైతన్య, నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మరోవైపు సమంత రూత్ ప్రభు కూడా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకుంది. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో వీరి పెళ్లి జరిగింది. నాగ చైతన్య – శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి సరిగ్గా మూడు రోజుల ముందు సమంత – రాజ్ వివాహం జరగడం కూడా అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత, ఆమె సోదరి సమంతతో కలిసి దిగిన ఫోటో వైరల్ కావడంతో మరోసారి వీరి వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. చైతూ మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “సమంత అనే పేరుతో చైతన్య జీవితానికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది” అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.