పాత్రకు తగ్గట్టు గెటప్ మార్చుకుంటే సరిపోయే రోజులు కావివి. అందుకు తగ్గట్టు శరీరాన్ని కూడా మార్చుకోవాలి. అవసరమైతే అనూహ్యంగా బరువు పెరగాలి. మళ్లీ అనూహ్యంగా బరువు తగ్గాలి. ఈ మ్యాజిక్ అంతా నెలల్లోనే జరిగిపోవాలి. దీనికోసం హీరోలు పడే పాట్లు మామూలుగా ఉండవు. రోజులో ఎక్కువ సమయం జిమ్‌లోనే గడపాలి. నోటిని కట్టేసుకొని బతకాలి. మరి ఇంత కష్టపడతారు కాబట్టే మన హీరోలకు అంతంత రెమ్యునరేషన్లు.
ప్రస్తుతం నాగచైతన్య అదే పనిలో వున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా చందు మొండేటి ఈ కథ తయారు చేసుకున్నాడు. ఇందులో నాగచైతన్యది జాలరి పాత్ర. అందుకే ఆ పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మలచుకునే పనిలో ఉన్నాడు నాగచైతన్య.
ఫిట్నెస్ కోసం జిమ్‌లో తను గట్టిగా కష్టపడుతూ ఓ వీడియోను ఎక్స్(ట్విటర్)లో పొందుపరిచాడు. ఈ వీడియోలో చైతూ నిజంగానే చాలా ధృఢంగా కనిపిస్తున్నాడు. పాత్రకోసం తను బాగా మారిపోయాడని ఈ వీడియో చూసినవారంతా చర్చించుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.