Virupaksha Director | టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశాలతో ఈ సినిమా వస్తుండగా.. నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా సెట్స్‌లో ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు నాగ చైతన్య.
గతేడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం కార్తీక్ చాలా రోజుల తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నాగ చైతన్య చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కార్తీక్ చైతూని కలువగా చైతన్య ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథాంశం మరియు జానర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సినిమాని SVCC నిర్మిస్తున్నట్లు సమాచారం.